Friday, January 9, 2026

STORY ABOUT FRIENDSHIP

స్నేహం::
(మహాభారతం అనుశాసన పర్వంలో భీష్ముడు ఓ చిన్న కథను ధర్మరాజుకు చెప్పాడు.)
ఆ కథలో స్నేహం, కృతజ్ఞత ప్రస్తావన కనిపిస్తుంది. ఒకసారి స్నేహం ఏర్పడి ఒకరినొకరు ఆశ్రయించుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేదాన్ని ఓ పిట్ట, చెట్టు కథలో చెప్పాడు భీష్మాచార్యుడు. 
పూర్వం కాశీదేశంలో ఓ చక్కని పచ్చని అడవిలో పూలు, పళ్లతో కళకళలాడుతూ ఓ పెద్దవృక్షం ఉండేది. అదే చెట్టు తొర్రలో ఏనాటి నుంచో ఓ చిలుక నివసిస్తోంది. తనకు నీడనిచ్చిన ఆ చెట్టంటే చిలుకకు ఎంతో ప్రాణం. కొమ్మలను ఊయలగా చేసి తనను ఆడించిన చెట్టును తన ప్రాణసఖుడిగా, ఉత్తమ స్నేహితుడిగా భావించింది. 

ఆ చెట్టుకు సమీపంలో వేటగాడు ఉండేవాడు. ఓ రోజు ఓ మృగాన్ని గురి చూసి బాణాన్ని వదలగా.. అది గురితప్పి ఆ మహావృక్షం మొదట్లో గుచ్చుకుంది. బాణానికి ఉన్న విష ప్రభావంతో ఆ చెట్టు రోజురోజుకూ క్షీణిస్తూ చివరకు మోడైంది. చెట్టు దుస్థితిని చూసి చిలుక ఎంతో బాధపడింది. చెట్టు మీద మిగతా పక్షులన్నీ తమ దారి తాము వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. కానీ చిలుక మాత్రం మోడుబారిన చెట్టు తొర్రలోనే ఉండిపోయింది. 

కొంత కాలం గడిచింది. తరచూ దేవేంద్రుడు ఆకాశ మార్గాన అటుగా వెళ్తుండేవాడు. ఎన్నోసార్లు ఆ చెట్టును చూశాడు. కానీ అన్ని పక్షుల్లా కాక.. చిలుక మాత్రం ఎండిన చెట్టుతోనే ఉండటం దేవేంద్రుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే ఇంద్రుడు ఓ సాధారణ బాటసారిలా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అక్కడే ఉన్న చిలుకతో మాట కలిపాడు. ‘చిలుకా! ఈ చెట్టు ఎండిపోయింది కదా.. ఈ పక్కనే ఇంకా పూలు, పళ్లు ఉన్న చెట్లు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్లకుండా నువ్వు ఇక్కడే ఎందుకున్నావ్‌?’ అని ప్రశ్నించాడు. 

ఆ ప్రశ్నకు బదులుగా చిలుక.. ‘ఇన్నాళ్లూ ఈ వృక్షం  స్నేహితుడిగా నన్ను ఆదరించింది. ఇప్పుడు దానికి కష్టం వచ్చిందని, నాకు పనికిరాదని నా దారిని నేను వెళ్లిపోవడం స్నేహధర్మం అనిపించుకోదు’’ అని పలికింది. చిలుక స్నేహభావం ఇంద్రుడికి ముచ్చటగొలిపింది. ‘నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో’ అన్నాడు ఇంద్రుడు. చిలుక తడుముకోకుండా ‘అయ్యా! నాకంటూ ఏ వరం అక్కర్లేదు. ఈ చెట్టును మళ్లీ బతికించండి’ అని కోరింది. దేవేంద్రుడు కొన్ని అమృతబిందువులను చెట్టుపై చిలకరించాడు. చెట్టు మళ్లీ బతికింది. పచ్చదనాన్ని సంతరించుకుంది. పూలు, పళ్లతో పూర్వవైభవాన్ని పొందింది. 

నిజమైన స్నేహితుడంటే చిలుకలా మిత్రుడి పట్ల సదా కృతజ్ఞత భావంతో మెలుగుతూ ఉండాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథసారం స్నేహితులందరికీ ఆచరణీయం, ఆదర్శయోగ్యం.


No comments:

Post a Comment